మరణం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు. దీనికి వయస్సుతో పనిలేదు.. కనికరం లేని ఈ చావు.. కరోనా వచ్చినప్పటి నుంచి లోకంలో మృత్యుఘోష ఎక్కువగా వినిపిస్తోంది. అదీగాక కరోనా అనంతరం హార్ట్ ఎటాక్ (Heart attack)లు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అందులో ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది.
చిన్న పెద్ద అనే తేడా లేకుండా అనేకమంది గుండెపోటుతో అర్ధాంతరంగా మృతిచెందుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చోటు చేసుకొంటున్నాయి.. తాజాగా.. మరో బాలుడు గుండెపోటుకు బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఒక పెళ్లి వేడుక జరిగింది. వివాహం అనంతరం నిర్వహించిన బరాత్‌లో డ్యాన్స్ (Dance) చేస్తూ సుధీర్ అనే 15 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు.
దీంతో అప్రమత్తమైన బంధువులు, స్నేహితులు వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సమయం మించి పోయింది. అతన్ని పరీక్షించిన వైద్యులు మృతిచెందాడని నిర్ధారించారు. మరోవైపు డీజే (DJ) బాక్స్‌ల శబ్ధానికే బాలుడికి గుండెపోటు వచ్చి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చనిపోయిన బాలుడు వరుడికి సోదరుడు కావడం గమనార్హం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిల్చున్న వారు నిలచ్చునట్లే.. కూర్చున్న వారు కూర్చున్నట్లే కుప్పకూలి పోతున్నారు. ఇక జిమ్ చేసే వారిలో సైతం ఇలాంటి మరణాలు చోటు చేసుకొంటున్నాయి. ముఖ్యంగా మగవారు ఎక్కువగా ఈ ప్రమాదాల బారిన పడటం గమనించవచ్చని అంటున్నారు.