సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పార్టీ నేతల మొరను ఆలకించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు(V.Hanumantha Rao) కోరారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ తమపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఎన్నిరోజులని కోర్టుల చుట్టూ తిరగాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిణామాలపై సీఎంకు విన్నవించుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించానని అయితే ఆయన తమకు సమయం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తాము ఎక్కడికెళ్లినా బీఆర్ఎస్ నాయకులు కేసులు పెట్టారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ పీడ పోయిందన్న సీఎం ఇప్పుడు ఏం మాట్లాడటంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన నాలుగేళ్లకే ముఖ్యమంత్రి అయ్యింది రేవంత్ ఒక్కడేనని అన్నారు. తాము 20ఏళ్ల నుంచి ఉన్నా ఒక్కరికీ సీఎం పదవి రాలేదన్నారు.
పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది రేవంతే అని తెలిపారు. తాను రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదని, అయితే ఎవరికీ అన్యాయం జరగొద్దనేది తన అభిమతమని వీహెచ్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలు బాధపడుతున్నారనే విషయాన్ని గమనించాలని విన్నవించారు. పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వకుండా మనపై కేసులు పెట్టిన వారికి న్యాయం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.
కేసులు పెట్టిన వారి దగ్గరికెళ్లడంపై మండిపడ్డారు. భువనగిరి సీటు రాజగోపాల్ రెడ్డి సతీమణికి కావాలనుకున్నారు కానీ బీసీ బిడ్డకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అలాంటి నిర్ణయాల్లో తప్పులేదన్నారు. అయితే, బయట డబ్బులు సంపాదించుకున్నోళ్లు పార్టీలో చేరుతున్నారని, ఎందుకో అర్థం చేసుకోవాలంటూ హెచ్చరించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి.. ఒక్క సైడ్ వినకు.. రెండు సైడ్స్ విను..’’ అంటూ సూచన ప్రాయంగా తెలిపారు.