మాజీ సీఎం కేసీఆర్ (KCR) పై సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి (Vamsichand Reddy) తీవ్ర విమర్శలు చేశారు.. ఆంధ్రా పాలకులు కృష్ణా జలాలను దోచుకుపోతుంటే దద్దమ్మలా కేసీఆర్ చూస్తుండిపోయారని ఆరోపించారు. రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరు (Palamuru) జిల్లాకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కన్నీళ్ళ గాథలు వినిపిస్తున్న పాలమూరు ప్రజల తరుపున మాట్లాడుతున్నానని తెలిపారు..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పిన కేసీఆర్.. తొమ్మిదేళ్లయిన పూర్తి చేయలేదని ఆరోపించారు. నాసిరకం పనులు ప్రాజెక్టు పొడవునా జరుగుతున్నాయన్నారు. దక్షిణ తెలంగాణపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపించారని వంశీచంద్ రెడ్డి మండిపడ్దారు. పాలమూరు ప్రాజెక్టు 90శాతం పనులు చేశాం అని చెబుతున్న మీరు.. ఆంధ్రోళ్లు సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా 11 టీఎంసీలు దోచుకు వెళ్తుంటే.. అసమర్ధతతో చూస్తూ ఉండిపోయారన్నారు.
మీ ప్రభుత్వ హయాంలో కృష్ణా నదిలో రావాల్సిన వాటాపై ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ స్థానంలో రేవంత్ రెడ్డి సీఎంగా ఉండుంటే 299 టీఎంసీలకు బదులుగా 577 టీఎంసీల వాటా వచ్చేదని వంశీచంద్ రెడ్డి తెలిపారు.. నీళ్ళు, నిధులు, నియామకాలు పాలమూరు జిల్లా ప్రజలకు రాలేదు కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు వచ్చాయన్నారు..
కేసీఆర్ డిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంగిపోయిందని.. ఉత్తర తెలంగాణ (Telangana)లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, దక్షిణ తెలంగాణనూ సైతం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. పదేళ్ల నిర్లక్ష్యం తుడిచి పెట్టీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలన చేస్తుంటే.. బీఆర్ఎస్ కుట్రలు చేస్తూ.. విమర్శలు చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.