పార్లమెంట్ భద్రతా వైఫల్యం (Parliament Security Breach)పై ప్రధాని మోడీ (PM Modi) తొలిసారి స్పందించారు. పార్లమెంట్‌లో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమని తెలిపారు. ఇది అత్యంత సీరియస్ ఘటన అని అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేయాల్సిన పనిలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అవసరమన్నారు. హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్‌కు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు.
పార్లమెంట్‌లో ఘటన అనంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తుల మూలాలను, వారి ఉద్దేశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమష్టి స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై ప్రధాని మోడీ స్పందించారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు స్టాంప్ వేసిందని వెల్లడించారు. విశ్వంలో మళ్లీ ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని తీసుకు రాలేదన్నారు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి చరిత్రాత్మక విజయం దక్కించుకుంటుందన్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా ఆ విషయం స్పష్టమవుతోందన్నారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేసిన అంశంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త వారని చాలా మంది భావిస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి వారు కొత్తవాళ్లేం కాదన్నారు. చాలా కాలంగా ప్రజల కోసం వాళ్లు కష్టపడ్డారన్నారు. వారికి ఎంతో అనుభవం ఉందని వివరించారు. కానీ చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయిందన్నారు. కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదన్నారు. ఇలాంటివి ప్రతి రంగంలోనూ జరుగుతాయన్నారు.
రామ మందిర ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీ మాట్లాడారు. భగవాన్ శ్రీ రామున్ని దర్శించుకోవడం ద్వారా జీవితం సఫలం అవుతుందని తెలిపారు. ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకోవాలని తనకు ఆహ్వానం రావడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ ఆనందం కేవలం మోడీది మాత్రమే కాదన్నారు. ఇది భారత్‌లోని 140 కోట్ల హృదయాల సంతోషమన్నారు. ఈ జనవరి 22 సందర్భం ‘హర్ ఘర్ అయోధ్య, హర్ ఘర్ రామ్’ కల సాకారం అవుతుందన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద, ధనిక ఆర్థిక వ్యవస్థల పరిస్థితి ప్రస్తుతం బాగా లేదని వివరించారు. నేడు భారత్‌లో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ప్రతి రంగం మెరుగైన పనితీరును కనబరుస్తోందన్నారు. కొత్త బడ్జెట్‌తో పాటు కొత్త పథకాలను కూడా ప్రభుత్వం రూపొందించనుందని వ్యాఖ్యలు చేశారు.