కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) వ్యవహారంపై వరుసగా మూడవ రోజు తనిఖీలు కొనసాగాయి. ఈ రోజు ఉదయం నుంచే మహదేవ్ పూర్ నీటి పారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ (Vigilance & Enforcement) అధికారులు సోదాలు చేశారు.
మొత్తం పది మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి , కన్నెపల్లి లక్ష్మీ పంపు హౌస్‌లకు సంబందించిన కీలక పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వాటిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. నిన్న కూడా అధికారులు తనిఖీలు చేశారు. సోదాల సమయంలో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మేడిగడ్డ అతిథి గృహంలో అధికారులు బస చేశారు. ఇప్పటికే వరకు ఓ మినీ ట్రక్కు నిండా దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నేటితో సోదాలు ముగిసినట్టు తెలుస్తోంది. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ రమేష్ చారి తెలిపారు. విచారణ అనంతరం ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదికను అందజేస్తామని ఎస్పీ రమేష్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఫీల్డ్ విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.