తమిళ నటుడు, డీఎండీకే అధినేత (DMDK Chief) విజయ్ కాంత్ (vijay Kanth) ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని వైద్యులు తెలిపారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా లేదని హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వివరించారు.
ప్రస్తుతం ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స చేయాలని వైద్య నిపుణులు సూచనలు చేశారని బులిటెన్ లో తెలిపారు. విజయ్ కాంత్ కు మరో 14 రోజుల చికిత్స అవసరమన్నారు. ఈ క్రమంలో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని దేవునికి ప్రార్థనలు చేస్తున్నారు.
అటు ఆయన పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. తమ నాయకుడికి ఏమి కావద్దని దేవున్ని కోరుకుంటున్నారు. గత కొంత కాలంగా ఆయన డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. డయాబెటిస్ వల్ల కుడికాలి మూడు వేళ్లను వైద్యులు గతంలో తొలగించారు. ఆయనకు లివర్ సమస్య కూడా ఉంది. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
విజయ్ కాంత్ ‘ఇనిక్కుం ఇలమై’ అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు. సుమారు 100కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 20కు పైగా సినిమాల్లో పోలీసు పాత్రలో నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు.