ఏపీలో వలంటీర్(Volunteer) వ్యవస్థపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో వరుస దోపిడీలు, లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏలూరు(ELURU)లో చోటుచేసుకుంది. ఓ వలంటీర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. బాలికను లోబరుచుకుని వరుసగా పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని ఓ గ్రామంలో 10వ తరగతి చదువుతున్న బాలికపై నీలాపు శివకుమార్ అనే వలంటీర్ కన్నేశాడు. తరచూ ఏదో సాకు చెప్పి బాలిక ఇంటికి రావడం మొదలుపెట్టాడు. ఇదే క్రమంలో బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని పలుమార్లు లైంగికదాడికి ఒడిగట్టాడు.
ఇంట్లో బాలిక తప్ప మరెవరూ లేని సమయం చూసి వలంటీర్ నీలాపు శివకుమార్ తరచూ ఇంటికి వస్తుండేవాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలిక ప్రవర్తనలో మార్పును గమనించారు. దీంతో బాలికను ఆరాతీయగా అసలు విషయం బయటపడినట్లు తెలుస్తోంది.
వలంటీర్ శివకుమార్ ఆధార్ కార్డులు కావాలని తరచూ ఇంటికి వస్తున్నాడని బాలిక తెలిపింది. ఈ క్రమంలోనే తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని తల్లిదండ్రులకు ఏడుస్తూ చెప్పింది. దీంతో తల్లిదండ్రులు దెందులూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.