ఎన్నికలు వస్తే.. చోటా లీడర్ నుంచి బడా నాయకుడి దాకా తెగ హడావుడి చేస్తారు. గ్రామ గ్రామానికి వెళ్తారు. ప్రతీ ఇంటి తలుపు తడతారు. మాకే ఓటేయాలని.. ఇప్పటిదాకా ఏం చేశారో ఏకరువు పెడతారు. ఇకపై ఏం చేస్తామో చెప్తూ నైస్ గా బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ఈసారి ఆ ఛాన్స్ ఇవ్వమని ఓ గ్రామం ఒకే మాట మీద నిలబడింది. ఏకంగా ఎమ్మెల్యేనే బహిష్కరించింది.
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో ఉంటుంది మంచిప్ప గ్రామం. రెండు చెరువుల మధ్య ఉండే ఈ ఊరు.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ బాజిరెడ్డి గోవర్ధన్ (Bajireddy Govardhan) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు వ్యతిరేకంగానే గ్రామంలోని జనం ఒక్క మాట మీద ఉన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వేశారు. తమ గ్రామానికి ఎన్నికల ప్రచారానికి రావొద్దంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అతికించారు.
మంచిప్ప రిజర్వాయర్ ను రద్దు చేయాలంటూ చాలా ఏళ్లుగా గ్రామస్తులు ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. రీ డిజైన్ రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావొద్దని.. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం చేయవద్దని తేల్చిచెప్పారు. శనివారం పోస్టర్లు అతికించి నిరసన తెలిపి.. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామంలో నిరసన తెలిపారు ప్రజలు.
తమ డిమాండ్ ను కాదని ఎన్నికల ప్రచారం చేస్తే అడ్డుకుంటామని తెగేసి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా ఓడిస్తామని శపథం చేశారు. మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్ రద్దు చేయకుంటే అసెంబ్లీ ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని గ్రామంలో తీర్మానం చేశారు. ఎన్నికల సమయంలో మంచిప్ప రిజర్వాయర్ అంశం బాజిరెడ్డికి తలనొప్పిగా మారుతుందని అంతా అనుకుంటున్నారు.