హైదరాబాద్ (Hyderabad) లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. నిన్న ఉదయం వినాయక పందిళ్ల దగ్గర పూజల అనంతరం నిమజ్జన ర్యాలీలు బయలుదేరాయి. దీంతో హైదరాబాద్ లో గణనాథుల శోభాయాత్ర (Shobha Yatra) సందడి మొదలైంది. చార్మినార్ మీదుగా హుస్సేన్ సాగర్ (Hussain Sagar) కు భారీగా గణపయ్య విగ్రహాలు తరలి వెళ్లాయి.
ఖైరతాబాద్ గణనాథుడు…
గణేశ్ విగ్రహాలను చూసేందుకు భారీగా భక్తులు తరలి రావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు జనంతో నిండిపోయాయి. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా భక్తులు చేరుకున్నారు. ఐదు గంటలపాటు ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర కొనసాగింది. క్రేన్ నెంబర్ 4 వద్ద హుస్సేన్‌సాగర్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు మహాగణపతి నిమజ్జనం జరిగింది.
బాలాపూర్ గణపయ్య…
బాలాపూర్ నుంచి బయలుదేరిన వినాయకుడి విగ్రహం చార్మినార్ నుంచి హుస్సేన్‌సాగర్‌కు ర్యాలీగా వచ్చిన తర్వాత నిమజ్జనం చేశారు. బాలాపూర్ గణేషుడిని అనుసరిస్తూ వందలాది వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చాయి. ఇంకా కొన్ని విగ్రహాల నిమజ్జనం ఇప్పటికీ జరుగుతోంది.
పోలీసుల డీజే డ్యాన్సులు…
గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువత డ్యాన్సులతో అదరగొట్టారు, అయితే భక్తులతో పాటు పోలీసులు కూడా కాలు కదిపారు. పోలీసుల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో మార్మోగాయి. నిమజ్జనం కోసం వచ్చే వారు డిజేలో పాటలు పెట్టడంతో దానికి అనుగుణంగా పోలీసులు నృత్యాలు చేశారు.
ఓ కానిస్టేబుల్ డివైడర్‌పై నిలబడి డీజే సాంగ్స్‌కు స్టెప్పులు వేశారు. గణేశ్ నిమజ్జనంలో ఈ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కానిస్టేబుల్ నృత్యానికి అక్కడి జనం ఫిదా అయ్యారు. మరికొందరు పోలీసు అధికారులు కూడా భక్తులతో కలిసి స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు.
వేలంలో రికార్డులు క్రియేట్ చేసిన లడ్డూ ప్రసాదాలు…
బాలాపూర్ గణనాధుడి లడ్డూ ప్రసాదం వేలంలో రూ. 27 లక్షలు పలికింది. ఈ లడ్డూని దక్కించుకునేందుకు 36 మంది వేలంలో పోటీ పడగా…దాసరి దయానంద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నారు. గతేడాది ఈ లడ్డూ రూ. 24.60 లక్షలు పలికింది. బాలాపూర్ లో లడ్డూ వేలం ప్రారంభమై ఈ ఏడాదికి 30 ఏళ్లు.
ఇదే కాకుండా చాలా చోట్ల గణనాధుడి లడ్డూలు వేలంలో రికార్డు స్థాయిలో ధరలు పలికాయి. హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్‌మండ్ విల్లాలో గణనాథుడి లడ్డూ రూ.కోటి 20 లక్షలు పలికింది. గతంలో కూడా ఇక్కడ గణపతి లడ్డు రూ. 60.80 లక్షలు పలికింది. అలాగే మదాపూర్ లోని మైహోమ్ భుజాలోని గణేశుని లడ్డూని రూ. 25 లక్షల 50 వేలకు చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు. గతేడాది కంటే ఇది రూ.7 లక్షలు అధికం.