టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. గురువారం సౌతాఫ్రికా(SA)తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ విరాట్ 76 పరుగులు చేశాడు. విరాట్ 2023 సంవత్సరంలో 2000 అంతర్జాతీయ పరుగుల మార్క్ అందుకున్నాడు.
146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఏడు క్యాలెండర్ సంవత్సరాల్లో 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. కోహ్లీ ఈ ఏడాది రెండు ఫార్మాట్ల (వన్డే, టెస్టు)లో కలిపి కేవలం 36 ఇన్నింగ్స్‌లోనే 2048 పరుగులు చేశాడు. విరాట్ తన కెరీర్‌లో ఏడుసార్లు 2000+ పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవగా, శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర (6) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
విరాట్ 2012లో 2186 పరుగులు, 2014లో 2286 పరుగులు తీశాడు. అదేవిధంగా 2016లో 2595 పరుగులు, 2017లో 2818 పరుగులు, 2018లో 2735 పరుగులు, 2019లో 2455 పరుగులు చేశాడు. ఈ ఏడాది(2023) 2048 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ ప్లేయర్ మహేల జయవర్దనే మూడో స్థానంలో ఉన్నారు. సౌరభ్ గంగూలీ, సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్ నాలుగో ప్లేస్ ఉన్నాడు.
సౌతాఫ్రికా పర్యటనలో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓడింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా, బర్గర్ రెండు ఇన్నింగ్స్ కలిపి 7 వికెట్ల చొప్పున తీసి టీమిండియాను దెబ్బకొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల భారీ సెంచరీతో రాణించిన సఫారీ బ్యాటర్ డీన్ ఎల్గర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.