ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాజధాని(AP Capital) ఎక్కడ అనే ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం దాదాపు క్లారిటీ ఇచ్చింది. విశాఖ(Vishakapatnam) నుంచి పాలన సాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇన్ని రోజులు కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వల్ల జాప్యం జరిగింది. అయితే, డిసెంబర్ 8వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
సీఎం, మంత్రుల పర్యటన సమయంలో భవనాల వినియోగం కమిటీ, ఆర్థిక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిల నివేదిక ఆధారంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 35 శాఖలకు కార్యాలయాలు ఏర్పాటుకు సంబంధించి జీవో వెలువడింది. మంత్రులు, హెచ్వీడీలు, ప్రభుత్వ శాఖలకు భవనాలు కేటాయించింది. సీఎం క్యాంపు కార్యాలయం ఎక్కడనేది జీవోలో పేర్కొనలేదు.
మరోవైపు, రాజధాని ఏర్పాటుకు సంబంధించి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలనకు సంబంధించి మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ మొదటి వారం నుంచి విశాఖ వేదికగా సీఎం జగన్ పాలన ప్రారంభమవుతుందన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారన్నారు.
విశాఖను రాజధాని చేయడం ద్వారా 50 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని సిదిరి అన్నారు. డిసెంబరు నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభమవుతుందని ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనకు అనుగుణంగా.. రాజధాని తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రిషికొండ మిలీనియం టవర్స్‌లో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాలను కమిటీ గుర్తించింది.