వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) 20మంది పాఠశాల విద్యార్థులకు తీవ్రగాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనలు ఆంధ్రప్రదేశ్(AP)లోని విశాఖ పట్నం(Vishakapatnam)లో చోటుచేసుకున్నాయి. అయితే, రెండు ప్రమాదాల్లోనూ స్కూల్ ఆటో(School Auto)లు ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
విశాఖపట్నంలోని సంగం శరత్ థియేటర్ కూడలిలో స్కూల్ ఆటోను లారీని వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఓ వైపు లారీ వేగంగా వస్తుండగా మరోవైపు, ఆటో డ్రైవర్ కూడా అంతే వేగంతో రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. లారీ దూసుకురావడంతో ఆటో అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో ఆటో పల్టీలు కొట్టగా అందులో ప్రయాణిస్తున్న బేతనీ స్కూల్ విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు.
గమనించిన అటుగా వెళ్లే ప్రయాణికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన దెబ్బ తగిలిన ఇద్దరు పిల్లల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం వారు సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లారీని క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
మరో ప్రమాదం మధురవాడ, నగరపాలెం వద్ద చోటుచేసుకుంది. విద్యార్థులు ఆటోలో పాఠశాలకు వెళ్తుండగా పందులు అడ్డుగా వచ్చాయి. దీంతో వాటిని తప్పించే ప్రయత్నంలో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. వీరంతా భాష్యం స్కూల్ విద్యార్థులుగా స్థానికులు చెబుతున్నారు. ఒకే రోజు రెండు చోట్ల స్కూల్ ఆటోలు ప్రమాదాలకు గురికావడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.