అమెరికాలో రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే జో బైడెన్(Joe Biden) బెటర్ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) అన్నారు. మాస్కో కోణంలో చూస్తే బైడెన్ రెండోసారి గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు. మరోమాట ఎవరు గెలిచినా వారితో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
పుతిన్ బుధవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. బైడెన్ అనుభవం, అంచనా వేయగల నేత అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేవిధంగా బైడెన్ ఆరోగ్య పరిస్థతిపై వస్తున్న ఊహాగానాలపై అడిగిన ప్రశ్నకు తాను వైద్యున్ని కాదని, అలాంటి విషయాలు మాట్లాడటం సరికాదని పుతిన్ బదులిచ్చారు.
2021లో తాను బైడెన్ స్విట్జర్లాండ్‌లో కలిసినప్పుడూ ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. కానీ అప్పటికీ ఆయన సాధారణంగా ఉన్నారని తెలిపారు. ఆయనలాగే తాను పేపర్ చూస్తూ మాట్లాడతానని, అది పెద్ద సమస్యేమీ కాదని పుతిన్ చెప్పారు.
బైడెను వయసు మీదపడటంతో జ్ఞాపకశక్తి సన్నగిల్లిందనే విమర్శలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే. బైడెన్ విధానాలు చాలా బలంగా ఉంటాయని పుతిన్ అన్నారు. కొన్ని విషయాల్లో తప్పులను స్వయంగా చెప్పానని, ఉక్రెయిన్‌లోని రష్యన్‌లను కాపాడడానికి నోటో ముప్పును తప్పించడానికి సైనిక చర్యను ప్రారంభించామని గుర్తుచేశారు.
అమెరికా విదేశాంగ విధానానికి నాటో ఒక ఆయుధం లాంటిదని వ్యాఖ్యానించారు పుతిన్. నాటో దేశాలు తమ రక్షణ బడ్జెట్‌ను పెంచకపోతే తానే రష్యాను ఉసిగొల్పుతానంటూ ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన కోణంలో అది సరైనదే అయి ఉండొచ్చన్నారు. మిత్రదేశాలతో సంబంధాలను పెంపొందించుకోవడానికి అది ఆయన విధానమై ఉంటుందని వ్యాఖ్యానించారు.