తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS)లో చోటు చేసుకొంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.. ఇప్పటికే కారు వదిలి వెళ్తున్న నేతల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండగా.. తాజాగా వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి మరో బిగ్ షాక్ తలిగింది. బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (Aroori Ramesh) పార్టీకి, తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గులాబీని వదిలి కమలంలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం బీజేపీ (BJP) అగ్ర నేతలు ఆయనను కలిసినట్లు సమాచారం. మొత్తానికి రమేష్ పార్టీ మారుతుండటంతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో సరైన గుర్తింపు లేదని కండువాలు మార్చుకొంటున్న నేతలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు..
ఇవే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి.. రమేష్ కూడా గత కొంతకాలంగా తనకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు చర్చించుకొంటున్నారు.. ఇక ఆయన అనుచరులు కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.. కానీ రమేష్ పార్టీ వీడితే వచ్చే నష్టాన్ని అంచనా వేసుకొన్న అధిష్టానం.. అగ్ర నేతలతో బుజ్జగింపు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఈ బాధ్యతలను అప్పగించింది. కానీ అందుకు కడియం అంగీకరించలేదని తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను రంగంలోకి దించింది. ఆరూరి రమేష్‌ను పార్టీ మారకుండా బస్వ రాజు బుజ్జగిస్తున్నారు. కానీ రమేష్ మాత్రం పార్టీ మారేందుకే సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి ఆయన పోటీకి దిగే అవకాశం ఉందని అప్పుడే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు ఇప్పటికే 15మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన విషయం తెలిసిందే.