షహీద్ జై దేవీ తోమర్ ((Shaheed Jai Devi Tomar)… వీర బాలిక శివ దేవీ తోమర్ (Shiva Devi Tomar) సోదరి. బ్రిటీష్ వాళ్లపై విరుచుకు పడిన శివ దేవీ ధైర్య సాహసాలను పునికి పుచ్చుకున్నా గొప్ప ధైర్యశాలి. సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకున్న సివంగి. 14 ఏండ్ల వయసులో బ్రిటీష్ అధికారిని మట్టు పెట్టిన పోరాట యోధురాలు.
17 మందిని ఊచ కోత కోసిన తర్వాత శివ దేవీ తోమర్ బ్రిటీష్ సైన్యం చేతిలో మరణించారు. సోదరి మరణ వార్త విని జై దేవీ ఆగ్రహంతో ఊగి పోయారు. తన సోదరి మరణానికి కారణమైన బ్రిటీష్ వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ మేరకు చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న యువకులను విప్లవ పోరాటం వైపు ప్రేరేపించి ఓ దళాన్ని ఏర్పాటు చేశారు. లక్నోకు వెళ్తున్న బ్రిటీష్ సైన్యం కదలికలపై నిఘా పెట్టారు. లక్నోలోని ఓ ప్రాంతానికి వెళ్లిన తర్వాత బ్రిటీష్ సైన్యం జై దేవీ దళాలకు కనిపించకుండా పోయింది. దీంతో ఆమె నేతృత్వంలోని దళాలు నిద్రాహారాలు మాని మరీ వెతికాయి.
ఈ క్రమంలో బ్రిటీష్ వాళ్ల సైన్యం కంట పడింది. వెంటనే ఓ ఆంగ్లేయ అధికారిని హత్య చేశారు జై దేవీ. ఆమెతో వచ్చిన దళాలు బ్రిటీష్ సైన్యంపై దాడికి దిగాయి. అక్కడి బంగ్లాకు నిప్పంటించాయి. చివరకు ఈ యుద్ధంలో జై దేవీ తోమర్ వీర మరణం పొందారు. స్కూల్ కు వెళ్తూ తల్లి దండ్రుల సంరక్షణలో ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో కత్తి పట్టి బ్రిటీష్ వాళ్లకి ఎదురు తిరిగిన ఈ ఇద్దరు తోమర్ సోదరీమణుల ధైర్య సాహసాలు ఎందరికో స్ఫూర్తిని కలిగించాయి.