రాష్ట్రం బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) రాజకీయాలతో అట్టుడికి పోతుందని అనుకొంటున్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ తో బీఆర్ఎస్ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హస్తం.. మరోవైపు ప్రభుత్వం పాలనలో విఫలం అవుతుందనే ఆరోపణలతో గులాబీ నేతలు.. ఇలా పొలిటికల్ వార్ నడుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలతో విరుచుకు పడుతున్నారు.. తాజాగా మరోసారి మాటల తూటాలు పేల్చారు..
కేసీఆర్ (KCR) వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని గత ఎన్నికల సమయంలో తెలిపినట్లు గుర్తు చేశారు.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదేపరిస్థితి నెలకొందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీళ్ల కోసం జనం తల్లడిల్లి పోతున్నారని ఆరోపించారు. అదేవిధంగా హైదరాబాద్ (Hyderabad)లో నీటి కోసం యుద్ధాలు మొదలైనట్లు పేర్కొన్నారు. దీనికంతటికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని కేటీఆర్ (KTR) మండిపడ్డారు.
ఈ అసమర్థ సీఎం దన వనరులు ఢిల్లీ తరిలించే ప్రయత్నంలో ఉన్నారు తప్ప జల వనరులు తెచ్చే ప్రయత్నం చేయట్లేదని విమర్శించారు. గత ప్రభుత్వం 38 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపడితే.. దాని నిర్వహణ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేక పోతుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం కష్టాలు మొదలయ్యాయని తెలిపిన కేటీఆర్.. ఇది సహజ కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత అని వ్యాఖ్యానించారు.
పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. వీలైతే ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. నగరంలో నీటి ఎద్దడి ఏర్పడటం ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు.. మహిళలు ఖాళీ కుండలతో పోరాడుతున్నారు. ప్రజలు మంచి నీరు మహాప్రభో అంటూ నినాదాలు చేస్తున్నారని వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని కేటీఆర్ తెలిపారు.
ఆ వివరాలు రేవంత్ రెడ్డికి (Revanth Reddy) పంపుతున్నట్లు పేర్కొన్నారు.. మరోవైపు సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డ కేటీఆర్.. ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. నేను కొందరు హీరోయిన్లను బెదిరిస్తున్నారని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తే.. ఎవరినీ విడిచిపెట్టమని హెచ్చరించారు..