హైదరాబాద్ మహా నగరంలో సైబర్ నేరాలు(Cyber crimes) క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో సైబర్ నేర విభాగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం తరఫున సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ వింగ్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, వాట్సాప్ లింక్స్, రెట్టింపు ఆదాయం పేరిట సోషల్ మీడియాలో వచ్చే యాడ్ లింక్స్, పార్ట్ టైం జాబ్ పేరిట వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయొద్దని చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు పొగొట్టుకున్న వారిలో అధికంగా చదువుకున్న నిరుద్యోగ యువత, గృహిణులు, పెన్షనర్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సైబర్ నేర విభాగం అధికారులు వెల్లడించారు. వీరంతా తక్కువ టైంలో ఎక్కువగా డబ్బులు సంపాదించాలనే దురాశతో డబ్బులు పొగొట్టుకున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు.
అయితే, సైబర్ నేరగాళ్ల ఆట కట్టించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషి(Rachakonda cp tarun joshi) అన్నారు. అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న ముఠాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ నేరెడ్ మెట్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఇన్ స్పెక్టర్లు0, ఇతర అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.