తెలంగాణ (Telangana) కు మరో వారం రోజుల పాటు వర్షాలు (Rains) తప్పవంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాబోయే వారం రోజుల పాటు తెలంగాణాలో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. నేడు, రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
ఈ నెల 28, 29వ తేదీలలో మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ రెండు రోజులు ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
ఇక 30వ తేదీ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలు ప్రాంతాలకు భారీ వర్షసూచన జారీ చేశారు. వచ్చే నెల 1,2వ తేదీల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. నేడు హైదరాబాద్ లో కూడా సాయంత్రం నుంచి వర్షం పడుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇప్పటికే తెలంగాణాలో కురుస్తున్న వర్షాలతో సోమవారం కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. సూర్యాపేటలో 48.5 మి.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో 52.4 మి.మీ, ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 62.4 మి.మీ, మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకల్లో 78.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 17.9 మి.మీ, జనగాం జిల్లాలో 17.3 మి.మీ, సూర్యాపేట జిల్లాలో 15.1 మి.మీ, ములుగు జిల్లాలో 12.6 మి.మీ, మహబూబ్నగర్ జిల్లాలో 11.7 మి.మీ వర్షపాతం నమోదైంది.