పెళ్లి పత్రిక(Wedding Invitation) అంటేనే పెళ్లికూతురు, పెళ్లి కొడుకు, కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ఆశీర్వాదాలతో పేర్లను, వీలుంటే పెళ్లికొడుకు, పెళ్లి కూతురు ఫొటోలు లేదా దేవుళ్ల ఫొటోలను ముద్రిస్తుంటారు. అయితే తెలంగాణ(Telangana)లో ఓ యువకుడు మాత్రం తన పెళ్లి పత్రికను వినూత్న రీతిలో రూపొందించాడు.
ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫొటోను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఆరుట్ల(Arutla)లో బీజేపీ కార్యకర్తకు పెళ్లి నిశ్చయమైంది. అయితే బంధు మిత్రులను ఆహ్వానించేందుకు పెళ్లి పత్రికను వినూత్నంగా తయారు చేయించాలని అనుకున్నాడు.
ఇంకేముంది ఒక బీజేపీ కార్యకర్తగా లోక్‌సభ ఎన్నికల వేళ వినూత్న ప్రచారం చేయాలని అనుకున్నాడో ఏమో కానీ తన పెళ్లి కార్డుపై మోడీ ఫొటోను ముద్రించి ‘‘ నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. నరేంద్ర మోడీకి మీరు వేసే ఓటు” అంటూ ప్రింట్ చేయించాడు. ఆ పెళ్లి కార్డును తన బంధువులకు పంచడంతో ఆ కార్డుపై మోడీ ఫొటోను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
అయితే, ఇలా పెళ్లి పత్రికలపై మోడీ బొమ్మను ముద్రించడం ఇది మొదటిసారి ఏంకాదు. ఈ ట్రెండ్‌ను మొదట భైంసాకు చెందిన ఎడ్ల మహేష్ అనే వ్యక్తి మొదలు పెట్టాడు. అతడి పెళ్లి పత్రికలో మోడీ ఫొటో వేసి అభిమానాన్ని చాటుకున్నాడు. అప్పటినుంచి అనేకమంది యువకులు ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు.