తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత బీఆర్ఎస్ (BRS) ప్రజల్లో సెంటిమెంట్ రగిలిస్తూ రెండు సార్లు అధికార పీఠాన్ని చేపట్టిందనే టాక్ ఉంది. ఈ క్రమంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార పగ్గాలు కల్వకుంట్ల ఫ్యామిలీ చేయి దాటిపోవనే బలమైన నమ్మకం గులాబీ నేతల్లో ఉందనే అనుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పాలిట శాపంగా మారాయనేది విశ్లేషకుల అభిప్రాయం.. అలా మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) జెండా ఎగిరింది.
ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇప్పుడే మొదలైందంటున్నారు.. అసలే హస్తం అంటే నేతల మధ్య సఖ్యత లేని పార్టీ అనే పేరుంది. ఎన్నికల ముందు కూడా ఎడమొహం పెడమొహంగా ప్రచారాలు చేశారు. అదీగాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవుల విషయంలో గొడవలు జరగడం ఖాయమనే టాక్ జనంలో బలంగా నాటుకుంది. మరోవైపు బీఆర్ఎస్ కు ఇదొక అస్త్రంగా మారుతుందనే ఆలోచన కూడా మొదలైంది.
ఇక రాష్ట్రంలో ఉన్నది ఒక్క సీఎం (CM) సీటు.. పోటీ దారులు మాత్రం నలుగురైదుగురు.. మొదటి నుంచి ఈ అంశాన్ని బీఆర్ఎస్ గట్టిగానే ఎన్నికల్లో ప్రచారం చేసింది.. కానీ గులాబీ పార్టీపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ కు వరంగా మారి అధికారం రూపంలో చేతికి చిక్కిందని అంటున్నారు.. ఇలాంటి సమయంలో నేతలంతా ఒక్కతాటి మీద నిలబడి.. మంచి పాలన అందిస్తే మరోసారి అవకాశం దక్కుతుందని.. లేకుంటే అందరూ ఆనుకున్నట్టే కాంగ్రెస్ పాలన మున్నాళ్ళ ముచ్చటగా మిగులుతుందనే టాక్ వినిపిస్తుంది.
మరోవైపు సీఎం ఎవరనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ (Delhi) వెళ్లిన మాణిక్ రావు ఠాక్రే, డీకే శివకుమార్, మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో సీఎం క్యాండిడేట్ ని ఎంపిక చేస్తారు. అనంతరం డీకే ఠాక్రే సీల్డ్ కవర్ తో సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుంటారు. అందులో ఎవరి పేరు ఉంటుందో వారే తెలంగాణ సీఎం కానున్నారు.