కాంగ్రెస్ పై ఏఐఎంఐఎం అధినేత (AIMIM Chief), హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ( Asaduddin Owaisi)తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఆ పార్టీ సీనియర్ నేత ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారని చెప్పారు. అదేవిధంగా కమల్ నాథ్ కూడా బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. గతంలో ఎంఐఎంను బీజేపీ బీ టీమ్ అంటూ విమర్శలు చేశారని చెప్పారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నిజమైన టీమ్ ఏదో…బీజేపీకి బీ టీమ్ ఏదో ఇప్పుడు వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
మహారాష్ట్రలోని అఖోలాలో ఓ బహిరంగ సభలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరారని, ఇప్పుడు కమల్ నాథ్ కూడా ఆయన్ని ఫాలో అవుతున్నారని అన్నారు. ఇప్పుడు బీజేపీ బీ టీమ్ ఏదో అర్థమైందన్నారు. మన సమాజంలో సెక్యులరిజం పేరుతో మనల్ని భయపెట్టిస్తున్న పాములను గుర్తించాలని కోరారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పై ఓవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అజిత్ పవార్ తన సోదరి సుప్రియా సూలేకు వ్యతిరేకంగా తన సతీమణిని బరిలోకి దించుతున్నారని తనకు తెలిసిందని అన్నారు. అసలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ముస్లింలు డిసెంబరు 6, 1992ని ఎప్పటికీ మరచిపోకూడదని సూచించారు. బాబ్రీ మసీదు ఇప్పటికీ ఉందని, అదే అలాగే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలన్నారు.
లేదంటే మరో బాబ్రీ (సంఘటన) జరుగుతుందని హెచ్చరించారు. యూదులు హోలోకాస్ట్ను గుర్తుంచుకున్నట్లే ముస్లింలు బాబ్రీని గుర్తుంచుకోవాలన్నారు. మసీదులను రక్షించడం ముస్లింల కర్తవ్యమని చెప్పారు. ఈ కర్తవ్యాన్ని తాము ఎప్పటికీ మరువలేమని వివరించారు. 2024 ఎన్నికల్లో లోక్సభలో ముస్లిం సభ్యుల ప్రాతినిధ్యం పెరగాలని, మహారాష్ట్ర నుంచి 4 సీట్లు గెలవాలని ఎంఐఎం కార్యకర్తలు లక్ష్యంగా పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.