నేల తల్లికి ప్రకృతి పట్టిన గొడుగు పుట్టగొడుగు. ఇది ఓ శిలీంద్రం. సింపుల్ గా చెప్పాలంటే ఓ బూజు. అయితే.. ఈ బూజు గురించి మాకెందుకని కొట్టిపాడెయ్యకండి.! మనవాళ్లు బూజుని బ్రహ్మాండమైన వంటగా మలిచేస్తారు మరి. ఇది నేలపైన లేదా చెట్ల బెరడుపై పెరుగుతుంది. ఓపిక తెచ్చుకుని లెక్కపెట్టాలే గానీ వీటికి చాన్తాడంత ఫ్యామిలీ ఉంది. చిన్నా చితకా కలిపితే 3వేల కంటే ఎక్కువ రకాలు ఉన్నాయంట.
ఎన్నుంటే ఎందుకు.. వాటిలో కొన్ని మాత్రమే తినడానికి పనికొస్తాయి. తినదగిన పుట్టగొడుగులు రంగులేకుండా తెలుపు రంగుతో ఉంటాయి. ఇది శిలీంద్రం అన్నమాటేగానీ మష్రూమ్స్ ను ఒక మొక్కని చెప్పొచ్చు. అయితే.. మొక్కలలో క్లోరోఫిల్ ఉండడం వల్ల ఆకు పచ్చగా ఉంటాయి. అదే, పుట్టగొడుగుల్లో క్లోరోఫిల్ ఉండదు. అంతే తేడా. పూర్తిగా సేంద్రీయ వ్యర్థాల వంటి ఇతర వనరులపై ఆధారపడతాయి.
సరే.. అవేం తింటే మనకెందుకు. మనం తినడానికి ఏం పనికొస్తాయో వాటి గురించి చూద్దాం. పుట్టగొడుగుల రకాల్లో ఒకటి ‘అగారికస్ బిస్పోరస్(Agaricus bisporus)’ అనే రకాన్ని లొట్టలేసుకుని తింటాం. దీన్నే సాధారణ పుట్టగొడుగు అని వ్యవహరిస్తారు. ఇది ఉత్తర అమెరికా, యూరప్ నుండి ఉద్భవించిందని చెబుతారు. ప్రస్తుతం, ఈ రకమైన మష్రూమ్స్ ను 70కి పైగా దేశాలలో సాగు చేస్తున్నారు.
చాలా మంది శాఖాహారులకు నాన్ వెజ్ వంటకాలకు ప్రత్యామ్నాయంగా దీన్ని లాగించేస్తుంటారు. కొంతమంది సూప్, సలాడ్లలో వేసుకుంటారు. కోసి కారం పెట్టి.. కాస్త మసాలా తగిలిస్తే చికెను, మటను మూతి ముడుచుకుంటాయి. ఆకలిని ప్రేరేపించడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందట. అందుకే, అన్నిట్లోనూ కాస్త తగిలిస్తుంటారు. గుడ్లు వంటి ఇతర ఆహార పదార్థాలతో, శాండ్ విచ్ లలో, ఇతర కూరగాయలతో పాటు కలుపుతారు. పిజ్జాల కోసం పాస్తా సాస్, టాపింగ్స్ ను తయారు చేయడానికి పుట్టగొడుగుల్ని వాడతారు. టేస్ట్ పిచ్చెక్కిస్తుందన్న మాట.
పుట్ట గొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92 శాతం నీటిని కలిగి ఉంటాయి. పొటాషియం, సోడియం యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. వీటిలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. సరే.. విటమిన్లు వగైరాలు ఎక్కువగా ఉన్నాయని.. వానాకాలంలో మష్రూమ్స్ ఎక్కువ తినకూడదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. లేదు మా బాడీ ఉక్కు.. చింత పండుతొక్కు అని తింటే తిప్పలు తప్పవు మరి. వాంతులు, వికారం, చర్మంపై దద్దుర్లు, విరేచనాలు వస్తాయి.
పాలిచ్చే తల్లులు, గర్భిణులు పుట్ట గొడుగులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వామ్మో.. కొన్ని రకాల పుట్ట గొడుగులు తింటే మెంటల్ ప్రోబ్లమ్స్ కూడా వస్తాయట. కొన్నిరకాలు అయితే.. గుండె దడ, గాబరా వగైరాలు తెప్పిస్తాయట. వద్దన్నప్పుడు ఇవి తిని లేనివి తెచ్చుకోవడం ఎందుకు? ఏం తింటే బావుంటుందో.. అవి తింటే ప్రాణం హాయిగా ఉంటుంది కదా. సుఖాన ఉన్న ప్రాణాన్ని దు:ఖాన పెట్టుకోవడం ఎందుకు? వర్షాకాలం పోయేదాకా మార్టుల్లో డిస్ ప్లే చేసిన మష్రూమ్స్ వంక కన్నెత్తి చూడకుండా ఉంటే బెటర్.