లిక్కర్ స్కాం (Liquor case) కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత(Mlc Kavita) కు ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కవిత తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ కోరుతూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే, కవిత తరపు న్యాయవాదులు వేసిన మధ్యంతర బెయిల్ (Interim bail)పిటిషన్‌పై సమాధానం చెప్పేందుకు తమకు సమయం ఇవ్వాలని ఈడీ తరఫు లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఇరువైపులా వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు లిక్కర్ స్కాం కేసులో నిందితురాలి ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు సంధించారు.
దీనిపై ఆమె స్పందిస్తూ..‘ ఇది మనీలాండరింగ్ కేసు కాదు. పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని కవిత ఆరోపించారు.
మూడో నిందితుడు ఎలక్టోరోల్ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50కోట్లు ఇచ్చాడని కవిత సంచలన ఆరోపణలు చేశారు.లిక్కర్ స్కాం కేసు నుంచి తను క్లీన్‌గా బయటకు వస్తానని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రూవర్‌గా మారబోనని కవిత స్పష్టంచేశారు. తనను తాత్కాలికంగా అరెస్టు చేయవచ్చు కానీ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని ఆమె తెలిపారు. కాగా, కవితను ఈడీ కస్టడీకి ఇచ్చిన పది రోజుల కోర్టు అనుమతి మంగళవారంతో ముగిసింది.