అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి (Ram Temple consecration ceremony) తనకు ఆహ్వానం అందిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వెల్లడించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలపారు.
ఇప్పటికే కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అదీర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానాలు అందాయి. రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంపై సరైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇప్పటికే కాంగ్రెస్ తెలిపింది. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందిందని ఖర్గే చెప్పారు.
ఆలయ ట్రస్టు కార్యదర్శితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ తనను కలిశానని పేర్కొన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాలని తనను వారు కోరారన్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. అంతకు ముందు బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త కార్మిక చట్టాలను ఖర్గే వ్యతిరేకించారు. అవి నియంతృత్వానికి సంకేతాలని ధ్వజమెత్తారు. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనేందుకు పౌరహక్కుల నేతల్ని ఆహ్వానించినట్లు ఖర్గే వెల్లడించారు.