కేంద్ర కేబినెట్ (Union Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రాత్మక (Historical) మహిళా రిజర్వేషన్ (Woman Reservation Bill) బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ప్రధాని మోడీ (PM Modi) నేతృత్వంలోని కేబినెట్ ఓకే చెప్పింది.
ఈ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ నిన్ననే వెల్లడించారు. అన్నట్టుగానే ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పుడు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును ఈ రోజు లోక్ సభ ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్టు లోక్ సభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది.
ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే ఇక లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. ఈ బిల్లు ఆమోదం పొందే సమయంలో మహిళలతో దేశ రాజధానిలో భారీ బహిరంగ సభకు బీజేపీ వర్గాలు ప్రణాళికలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున మహిళలను ఢిల్లీకి తరలించాలని ఎంపీలు, కాషాయ శ్రేణులకు అధిష్టానం నుంచి సంకేతాలు వెళ్లినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో ప్రధాని మోడీకి తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఆమె అభివర్ణించారు. ప్రజాసేవలోకి ప్రవేశించేలా మహిళల్లో ఈ బిల్లు స్ఫూర్తి కలిగిస్తుందన్నారు. తద్వారా ఈ సమాజానికి మేలు చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు.