క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. రేపు(ఆదివారం) నిర్వహించనున్న వరల్డ్ కప్(World Cup) ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదికైంది. ఈ మ్యాచ్‌ను కళ్లారా చూసేందుకు క్రికెట్ అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్(Ahmedabad)కు క్యూకడుతున్నారు.
భారత్-అస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఎంతదూరం వెళ్లడానికైనా వెనుకాడడం లేదు. ప్రత్యక్షంగా తిలకించేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుని మరీ అహ్మదాబాద్‌కు పెద్దసంఖ్యలో పయనమవుతున్నారు. రేపే మ్యాచ్ కావడంతో ఒకరోజు ముందుగానే అభిమానులు అహ్మదాబాద్‌కు చేరుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన సర్వీసులకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో విమాన సంస్థలు టికెట్ల ధరలు అమాంతంగా పెంచేశాయి. శనివారం ఈ రూట్‌లో సర్వీసుల విమాన టికెట్ ధర ఏకంగా రూ.35,999లు పలికింది. ఇండిగో సంస్థ హైదరాబాద్ నుంచి నేరుగా అహ్మదాబాద్ నడుపుతున్న నాలుగు సర్వీసుల్లో టికెట్లు ఇదే ధర పలకడం గమనార్హం.
సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు టికెట్ ధర రూ.5,700 ఉండగా.. నవంబరు 18వ తేదీకి ఈ రూట్ లో టికెట్ కోసం ఏకంగా రూ.33వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంబైకి కూడా వన్ వే చార్జీలు రూ.16వేలకు పైగానే ఉన్నాయి. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఇండిగో సంస్థ శనివారం బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఆరు సర్వీసులు నడుపుతోంది.