ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన పాసు పోర్టుల (Powerful Passports) జాబితాను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ (Henley Passport Index) విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్, సింగపూర్లు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. ఆయా దేశాల పాసుపోర్టుతో ఎలాంటి వీసా లేకుండానే 194 దేశాల్లో పర్యటించవచ్చు.
ఈ జాబితాలో భారత్ పాసుపోర్టు 85వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే వీసా లేకుండా తమ దేశాల్లో భారతీయులను అనుమతించే దేశాల సంఖ్య 60 నుంచి 62కు పెరిగింది. అయినప్పటికీ ఈ జాబితాలో భారత్ పాసుపోర్టు స్థానం కిందకి పడిపోవడం గమనార్హం. ఇక దాయాది పాక్ గతేడాది లాగానే ఈ సారి కూడా 106వ స్థానంలో నిలిచింది.
ఎలాంటి వీసా లేకుండానే పాక్ పౌరులు 34 దేశాల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంది. ఇక పొరుగు దేశం బంగ్లాదేశ్ గతంతో పోలిస్తే ఒక స్థానం కిందకి పడిపోయింది. గతేడాది ఈ జాబితాలో బంగ్లాదేశ్ 101 వస్థానంలో ఉండగా, ఈ ఏడాది 102వ స్థానానికి పడిపోయింది. ఇక మాల్దీవులు ఈ జాబితాలో 58వ స్థానంలో ఉంది.
ఇక సౌదీ అరేబియా రెండు స్థానాలు మెరుగు పరుచుకుంది. గతేడాది సౌదీ అరేబియా ఈ జాబితాలో 65 వ స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 63వ స్థానానికి ఎగబాకింది. అటు డ్రాగన్ కంట్రీ కూడా ఈ జాబితాలో రెండు స్థానాలు మెరుగు పరుచుకుంది. గతేడాది చైనా 66 నుంచి 64వ స్థానానికి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా గతంతో పోలిస్తే ఏడు నుంచి ఆరవ స్థానానికి చేరింది.