చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపినట్లు.. పులి నోట్లో తలపెట్టినట్లే అవుతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM Jagan) విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రి(Thadipatri) నుంచి మూడో విడత ప్రచారాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(TDP Chief Chandrababu Nayudu)పై విమర్శలు గుప్పించారు.
కూటమి పేరుతో గుంపులు గుంపులుగా వస్తున్నారని.. వాళ్లందరికీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని హెచ్చరించారు. తన నమ్మకం ఆ దేవుడిపై, ప్రజలపైనే అని.. మేనిఫెస్టో ప్రకటించాక ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం కోరుతున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయన్నారు. ఇది చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యమని వెల్లడించారు.
మళ్లీ మోసం చేసేందుకు టీడీపీ-జనసేన- బీజేపీ కూటమిగా వస్తున్నాయన్నారు సీఎం జగన్. సూపర్ 6, సూపర్ 7 అంటున్నారని.. వారిని నమ్మొద్దని సూచించారు. పొత్తులు, మేనేజ్మెంట్లను నమ్ముకొని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు.
తమ పాలనలో 2లక్షల 30వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామమని జగన్ చెప్పుకొచ్చారు. అందులో 80శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. పౌర సేవల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని వివరించారు. నాడు నేడుతో స్కూళ్లను బాగుచేశామన్నారు. ఇంగ్లీష్ మీడియంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. 58 నెలల పాలనలో లంచాల్లేని, వివక్షలేని పాలన అందించామని, ఎన్నో మంచి పనులు చేసి చూపించామన్నారు.