వైటీపీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు. ఢిల్లీలో గురువారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వారు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. షర్మిల వెంట ఆమె భర్త అనిల్ కుమార్ ఉన్నారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. తాను వైఎస్ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నానన్నారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో వైటీపీని విలీనం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనని తెలిపారు. మణిపూర్ లో రెండు వేల చర్చిలను ధ్వంసం చేయడం తనను కలచి వేసిందని.. అక్కడ సెక్యులర్ పార్టీ లేనందు వల్లే విధ్వంసం జరిగిందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ జోడో యాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు షర్మిల. ఆయన్ను ప్రధాని చేయడం తన తండ్రి కలగా చెప్పారు. ఆ కలను నిజం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ గెలుపు కోసం తాను తెలంగాణలో పోటీ చేయలేదని.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన ఘనత కాంగ్రెస్ దేనని తెలిపారు. మణిపూర్ లో క్రైస్తవులపై దాడులు దారుణమన్న ఆమె.. పార్టీ ఏం చెప్తే అదే చేస్తానన్నారు. అండమాన్ వెల్లమన్నా వెళ్తానన్న స్పష్టం చేశారు.
షర్మిలకు ఏపీ పీసీసీ పగ్గాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వైసీపీలో అసంతృప్తిలో ఉన్న నేతలు షర్మిల రాకతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు.