ఏపీ సీఎం వైఎస్ జగన్(YS Jagan) మేనత్త వైఎస్ విమలారెడ్డి(YS Vimalareddy) శనివారం ఉదయం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) , వివేకానంద రెడ్డి కుమార్తె సునీత(Sunita)లపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతూ వైఎస్ఆర్(YSR) పరువు రోడ్డు మీదకు తెస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై తాజాగా వైఎస్ షర్మిల స్పందించారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. విమలమ్మ తనకు మేనత్త అని తెలిపారు. అయితే ఆమె తనపై చేసిన ఆరోపణలు సరికాదని తెలిపారు. తాము ఏ ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు.
వివేకా హత్య కేసు విషయంలో తాము చేస్తున్నది ఆరోపణలు కాదని, సీబీఐ చూపించిన ఆధారాలను మాత్రమే తాము ఎత్తిచూపుతున్నామని స్పష్టం చేశారు. ఆధారాలుంటేనే కదా తమకు అసలు నిజం తెలిసిందంటూ వ్యాఖ్యానించారు. నిజం ప్రజలకు తెలియాలనే తాము మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు. హత్యా రాజకీయాలను ఆపాలనే కొట్లాడుతున్నామని వెల్లడించారు.
అదేవిధంగా హంతకులు చట్టసభలకు వెళ్లద్దని పోరాటం చేస్తున్నామని షర్మిల పునరుద్ఘాటించారు. విమలమ్మ కొడుకుకి జగన్ పనులు ఇచ్చారని, అందుకే వారు ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు. ఆకారణంగానే ఆమె జగన్ వైపు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక్కడ చనిపోయింది సొంత అనే విషయాన్ని విమలమ్మ తెలుసుకోవాలని షర్మిల హితవు పలికారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మర్చిపోయారని షర్మిల దుయ్యబట్టారు. ఆమెకు వయసు మీదపడిందని, అందులోనూ ఇది ఎండాకాలం కావడం వల్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.