వైఎస్ఆర్(YSR) హయాంలో ఉన్న ప్రజాదర్బార్ వారసుడి పాలనలో ఎక్కడ పోయిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మడకశిర(Madakashira) నియోజక వర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతూ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.
పెద్దపెద్ద కోటలు కట్టుకుని ఉన్న జగన్ ఎన్నికలు ఉన్నాయని సిద్ధం అంటూ బయటకు వస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఏపీ ప్రజలను మోసం చేసిందని, అయినా బాబు, జగన్ పోటీ పడి పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పొత్తు అయితే జగన్ తొత్తు అని సెటైర్ వేశారు. బీజేపీకి గులాంగిరి చేస్తూ బానిసలుగా మారారని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రంలో రాజ్యమేలుతోందన్నారు. బాబు, జగన్ ఇద్దరిలో ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనన్నారు. ఇలాంటి వారికి ఓటు వేయడం అవసరమా? హోదా ఇవ్వని అలాంటి పార్టీలు మనకు అవసరమా? అని ప్రజలు ఆలోచించాలని సూచించారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి సంజీవని లాంటిదని షర్మిల వ్యాఖ్యానించారు. అలాంటి హోదా వచ్చి ఉంటే ఇవాళ వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవన్నారు.
హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ హయాంలో 90శాతం పూర్తయితే 2019ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క పరిశ్రమను నెలకొల్పలేదని దుయ్యబట్టారు. భూసేకరణ చేసినా పరిశ్రమలు తేలేదన్నారు. లెదర్ పార్క్, మడకశిర నియోజకవర్గం చుట్టూ రింగ్ రోడ్ హామీలను మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
పదేళ్లుగా నియోజకవర్గాన్ని టీడీపీ, వైసీపీ మోసం చేస్తున్నాయని షర్మిల ఆరోపించారు. హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమేనని ష్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారంలో వస్తే మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పనపైనే అన్నారు. 2.25 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. మడకశిర ఎమ్మెల్యేగా సుధాకర్‌ను గెలిపించాలని, ఎంపీ గా సమద్ షాహిన్‌ను గెలిపించాలని షర్మిల ప్రజలను కోరారు.