ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నియోజకవర్గంలో సోమవారం భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సెటైర్లు వేశారు. ‘మీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అంటగా.. ఎప్పుడైనా మీ నియోజకవర్గానికి వచ్చాడా? అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈయన లిక్కర్ బాటిల్ మంత్రి అంటగా? అని సెటైర్లు వేశారు. అన్ని కాంట్రాక్టర్లకు ఈయన బినామీగానే ఉంటున్నాడని, అంబేడ్కర్ వారసుడు అయితే కల్తీ మద్యాన్ని విక్రయిస్తారా? అంటూ షర్మిల ప్రశ్నించారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం ఈ లిక్కర్ మంత్రి కాదా? అంటూ నిలదీశారు. మద్య నిషేధం అంటే ప్రభుత్వం మద్యం అమ్మడమా? నియోజక వర్గంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అంటూ ధ్వజమెత్తారు.
ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారని, ఒక చేత్తో ఇస్తారని, మరొక చేత్తో తీసుకుంటారని షర్మిల తెలిపారు. విద్యుత్ చార్జీలు ఏడుసార్లు, ఆర్టీసీ చార్జీలు ఐదుసార్లు పెంచారని, అదేవిధంగా నిత్యావసరాలు రెండింతలు పెంచారని షర్మిల అన్నారు. బటన్ నొక్కడమంటే.. ఇచ్చి తీసుకోవడం అన్న మాట.. అంటూ తన అన్న జగన్ పాలనపై సెటైర్ వేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.32లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి 23వేల పోస్టులలో మెగా డీఎస్సీ అన్నారని, ఐదేళ్లు అధికారం ఇస్తే గాడిదలు కాశారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయానికి ఆదరణ లేక రైతులు అప్పుల పాలు అయ్యారని, అప్పు లేని రైతు రాష్ట్రంలో లేనే లేడని తెలిపారు. పంట నష్టపరిహారం, గిట్టుబాటు ధర లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మూతపడిన చెక్కెర ఫ్యాక్టరీలు తెరిపిస్తామని హామీ ఇచ్చారు. చెరుకు సాగుకు పెద్దపీట వేస్తామని తెలిపారు. అదేవిధంగా రైతులకు 2 లక్షల వరకు రుణాలు మాఫీ, రూ.4 వేలు తక్కువ కాకుండా పెన్షన్, దివ్యాంగులకు రూ.6వేలు, మహిళలకు ఏడాదిరిక రూ.లక్ష సాయం, ఇళ్లులేని కుటుంబానికి రూ.5లక్షలు ఇస్తామని షర్మిల హామీఇచ్చారు. వైఎస్ఆర్ సుపరిపాలన కాంగ్రెస్తోనే సాధ్యమైదని, వైఎస్ఆర్ బిడ్డగా తాను మాటిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు.