ఏపీ ప్రభుత్వం(AP Government) కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్(CM jagan) బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ దఫాలో 10,511 జంటలకు సంబంధించిన రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. జూలై- అక్టోబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు లబ్ధి చేకూరగా 81.64 కోట్ల రూపాయలను వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అయితే, ఇప్పటి వరకు ఈ పథకం కింద వైఎస్ జగన్ సర్కార్ అందించిన మొత్తం సాయం రూ.349 కోట్ల నగదు విడుదలతో 46 వేల మందికి లబ్ధి చేకూరింది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేద వర్గాల ప్రజలకు ఆర్థిక సాయం అందించడం సంతోషకరమన్నారు. ఇప్పటివరకూ మూడు పర్యాయాలు కల్యాణమస్తు, షాదీ తోఫా అందించామని తెలిపారు. పేదింటి పిల్లలు విద్యావంతులు కావాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ పథకానికి 10వ తరగతి అర్హతలు పెట్టామని, దీంతో బాల్య వివాహాలు తగ్గుతాయని తెలిపారు.
పేదలందరికీ విద్య అందించడంలో భాగంగా విద్యాసంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలంతా ఉన్నత విద్య వైపునకు వెళ్లడానికే మోటివేషన్ చేయడం ఈ పథకం లక్ష్యంగా చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ ఆడపిల్లల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం, బీసీ కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు.