తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నిక (Assembly Election)ల్లో త్రిముఖ పోరు ఉంటుందని అందరు ఊహించారు.. కాని ఈసారి మూడు ప్రధాన పార్టీలతో పాటు మరికొన్నికొత్త పార్టీలు బరిలో ఉండనున్నాయి. అందులో వైఎస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP)కూడా ఒకటి.. ఈ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బైనాక్యులర్ గుర్తు పై ఆ పార్టీ చీఫ్ షర్మిల (Sharmila) అసంతృప్తి వ్యక్తం చేసింది.
మరో గుర్తు కేటాయించాలని షర్మిల ఈసీని ఆశ్రయించారు. అయితే వైఎస్ఆర్టీపీ చీఫ్ ఎక్కువ బాల్ గుర్తు పై ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే అంతకు ముందు నాగలి గుర్తు కోసం వైఎస్ఆర్టీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ధరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాల్, అగ్గిపెట్టె గుర్తులు ఖాళీగా ఉండటంతో ఈ రెండింటిలో ఏదో ఒక గుర్తు తమ పార్టీకి కేటాయించాలని షర్మిల ఈసీని కోరారు.
మరోవైపు 2023 నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీ 119 స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా షర్మిల ప్రకటించారు. తాను పాలేరు నుంచి బరిలో దిగనున్నట్టు తెలిపారు.. ఇక షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం.. పాదయాత్ర చేస్తూ వార్తల్లో నిలిచింది. మధ్యలో కాస్త సైలెంట్ అయిన పార్టీ కార్యకర్తలతో టచ్ లోనే ఉన్నారు షర్మిల.
ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు కాంగ్రెస్ అధిష్ఠానంతో షర్మిల పలు మార్లు భేటీ అయ్యారు. ఒకదశలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో.. అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని షర్మిల ప్రకటించారు.