ఈసీ (EC) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే అధికార, ప్రతిపక్ష, ప్రాంతీయ పార్టీలు అన్నీ అప్రమత్తం అయ్యాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ (Telangana)లో ఎవరెవరు పోటీ చేస్తారనే ఉత్కంఠ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో జనసేన (Janasena) క్లారిటీ ఇవ్వగా.. టీడీపీ (TDP) కూడా బరిలోకి దిగడానికి సిద్దం అంది.
అయితే ఏపీ (AP) లో ఉన్నట్టు.. తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తారా అనేది మిస్టరీగా ఉంది. మరోవైపు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSR Congress) పార్టీ పరిస్థితి ఏంటనేది సందేహంగా ఉన్న క్రమంలో, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం వైసీపీకి లేదని స్పష్టం చేశారు.
ఏపీలో జనసేన, టీడీపీతో పాటు ఎన్ని పార్టీలు కలసి పనిచేసినా సీఎం వైఎస్ జగన్ గెలుపుని అడ్డుకోలేరని సృష్టం చేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని అన్నారు. వైసీపీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువై నియోజకవర్గాలు సరిపోవటం లేదన్న వైవీ, జనసేన పార్టీకి కనీసం 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టుకునే పరిస్థితి లేదని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పడు టీడీపీ రాష్ట్రాన్నిదోచుకున్నదని చెప్పిన మాటలే ఇప్పుడు నిజం అయ్యాయని, బాబు చేసిన స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంల పై కోర్టుల ద్వారా పూర్తి విచారణ జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసిన మరోసారి ఏపీలో జగన్ సీఎం అవడం మాత్రం ఖాయమంటూ వెల్లడించారు.