ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ (Congress) పై తన అధికార పత్రిక ‘జాగో బంగ్లా’లో టీఎంసీ (TMC) నిప్పులు చెరిగింది. ‘జమిందారి మైండ్ సెట్’తో బీజేపీ పై కాంగ్రెస్ పోటీ చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని టీఎంసీ హితవు పలికింది. 2024 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన లోపాలను సరిదిద్దుకోవాలని సూచించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై టీఎంసీ నేత కునాల్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ విజయం కాదని ముమ్మాటికీ కాంగ్రెస్ వైఫల్యమేనన్నారు. కాంగ్రెస్ జమిందారీ మైండ్ సెట్‌తో పోరాటం చేస్తోందని మండిపడ్డారు. ఇది సరికాదన్నారు. అలాంటి మనస్తత్వాన్ని మార్చుకోవాలన్నారు. ఇండియా కూటమికి మమతా బెనర్జీ కొన్ని సూచనలు చేశారన్నారు.
ఆ సూచనలను కాంగ్రెస్ పాటించలేదని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా ముందుకు వెళ్లాలని ప్రయత్నించిందన్నారు. కానీ ఆ ప్రయత్నంలో కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోయిందన్నారు. అయితే ఇప్పటికీ సమయం మించి పోలేదన్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి, ఇండియా కూటమిని బలోపేతం చేయాలని ఆయన సూచించారు.
ఒక వేళ కాంగ్రెస్ తన తీరు మార్చుకోక పోతే మొత్తం ఇండియా కూటమికే నష్టం జరుగుతుందన్నారు. వ్యూహాలను ఖరారు చేసే సమయంలో కూటమిలోని ఇతర పార్టీల సలహాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. 2024 లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు కూటమిలోని పార్టీలన్నీ కలిసి వస్తాయని తెలిపారు.