అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Dist) లో మరో ఆర్టీసీ బస్సు (RTC Bus) బోల్తా పడింది. జిల్లాలోని ఫోర్ బై కెనాల్ సమీపంలో ఆదుపు తప్పిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకు ప్రయాణీకులున్నారు.ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణీకులకు గాయాలైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. గాయపడిన వారందరిని అటుగా వెళ్తున్న మరో బస్సులో చికిత్స నిమిత్తం స్థానిక డొంకరాయి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే…
విశాఖపట్నం మధురవాడ డిపో నుండి భద్రాచలం వెళ్తున్న లగ్జరీ ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో అదుపు తప్పి ఫోర్ బై గ్రామంలోని కెనాల్ సమీపంలో బోల్తా పడింది. ప్రమాద సమచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న మోతుగూడెం పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
మూడు వారాల కిందట పాడేరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు విశాఖ నుంచి పాడేరు వెళ్తుండగా ఘాట్ రోడ్ మలుపు వంజంగి వ్యూ పాయింట్ వద్ద 100 అడుగులు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా…20 మంది గాయపడ్డారు.
ఘాట్ రోడ్డులో వరుసగా ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురవుతుండటంతో…ఈ బస్సుల పైనే ఎక్కువగా ప్రయాణాలు చేసే ఏజెన్సీ వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.