అదానీ గ్రూపు(Adhani group) స్టాక్స్ లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలో హిండెన్ బర్గ్ (Hindenburg) రీసెర్స్ చేసిన ఆరోపణల వేడి కాస్త చల్లారిందని భావిస్తున్న తరుణంలో దాదాపు ఇవే ఆరోపణలతో మరో అంతర్జాతీయ రిపోర్ట్ బయటికి వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు వ్యాపార భాగస్వాములు మారిషస్ కు చెందిన డొల్ల కంపెనీల ద్వారా అదానీ స్టాక్ లో పెట్టుబడులు పెట్టినట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓ కథనంలో వెల్లడించింది.
యూఎస్ కు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ గత జనవరిలో అదానీ గ్రూప్ అక్రమ లావాదేవీలు బయటపెట్టిన తర్వాత వెలువడిన ఈ కథనం సంచలనం రేపుతోంది. మారిషస్ వంటి పన్ను స్వర్గధామాల్లో ఆఫ్షోర్ సంస్ధల్ని వాడుకుని అదానీ లిస్టెడ్ స్టాక్ లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్ బర్గ్ గతంలో ఆరోపించింది.
ఇప్పుడు ఓసీసీఆర్పీ(OCCRP) కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేయడం విశేషం. హిండెన్ బర్గ్ రిపోర్ట్ తర్వాత స్పందించిన అదానీ.. ఇది నిరాధారమని, పెట్టుబడిదారుల్ని తప్పుదోవ పట్టించేలా ఉందని తెలిపింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లను కోల్పోయాయి.
ఆ తర్వాత రుణాలు తిరిగి చెల్లించి పెట్టుబడి దారుల విశ్వాసం పొందాక తిరిగి ఇందులో 100 బిలియన్ డాలర్ల వరకూ కోలుకున్నాయి. ఓసీసీఆర్పీ చేసిన ఆరోపణలపై స్పందించిన అదానీ గ్రూప్.. గతంలో హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో ఆరోపించిన విషయాలే తాజా కథనంలోనూ ఉన్నాయని తెలిపింది. ఇవన్నీ నిరాధారమేనని వెల్లడించింది.
అదానీ గ్రూప్ యొక్క పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ పబ్లిక్ షేర్ హోల్డింగ్లకు సంబంధించిన నియంత్రణతో సహా వర్తించే అన్ని చట్టాలకు లోబడి ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఈ కథనాన్ని వెల్లడించిన రాయిటర్స్ వార్తా సంస్ధ మాత్రం దీన్ని స్వతంత్రంగా నిర్ధారించలేదని తెలిపింది. మరోవైపు గతంలో వెలువడిన హిండెన్ బర్గ్ రిపోర్ట్ పై ఇప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజా రిపోర్ట్ కలకలం రేపింది.