ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) రెండు వేల నోట్లకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ (New Update) ఇచ్చింది. ఇది అమెజాన్ యూజర్లకు చేదు వార్తే. క్యాష్ ఆన్ డెలివరీ (COD) సేవలపై రూ. 2000 నోట్లను ఇక తీసుకోబోవడం లేదని తెలిపింది. సెప్టెంబర్ 19 నుండి రూ. 2000 కరెన్సీ నోట్లను నగదుగా స్వీకరించడాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇకపై రెండు వేల నోట్లు తీసుకుంటే వాటిని మళ్లీ వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఆ తర్వాత వాటిని తాము క్యాష్ గా మార్చుకోవడం వంటి పనులకు సెప్టెంబర్ 30వ తేదీలోపు సమయం సరిపడదు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.
ఆర్బీఐ 2000 కరెన్సీ నోట్లును ఉపసంహరణ ప్రకటన తర్వాత కూడా అమెజాన్ క్యాష్ ఆన్ డెలివరీ సేవల్లో రూ. 2 వేల నోట్లను తీసుకునేందుకు అంగీకరించింది. బ్యాంకుల్లో రూ. 2000 మార్పిడికి గడువు సమీపిస్తున్న తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఇంటి వద్ద నుంచే రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశాన్ని కూడా అమెజాన్ కల్పించిన సంగతి తెలిసిందే.
కాగా, 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 నుంచి రూ. 2 వేల నోట్లను చెలామణి నుండి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఒకవేళ మీ వద్ద ఇంకా రూ.2000 నోట్లు ఉన్నట్లయితే, సమీపంలోని బ్యాంకులో సెప్టెంబర్ 30, 2023లోపు మార్చుకోవాలి లేదా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
మరో వైపు ఉపసంహరణ ప్రకటన తర్వాత ఆగష్టు 31 నాటికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93శాతం బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ పేర్కొంది. వీటి విలువ రూ. 3.32 లక్షల కోట్లు అని పేర్కొంది