తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) జోరుగా పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాగల రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ (Telanagana) లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా… ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణలో ఇవాళ పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురిస్తున్నాయి. హైదరాబాద్ లో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల వీధులు జలమయం కావడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. వాయువ్య బంగాళాఖాతం సమీపంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ… జిల్లాల్లో భారీవర్షం కురిసే అవకాసం ఉదని తెలిపింది. ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరో వైపు ఏపీలో కూడా వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు కోరారు.