ఎన్నిసార్లు భారత దేశం హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ డ్రాగన్ కంట్రీ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత్ భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. సోమవారం విడుదల చేసిన అధికారిక మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్(arunachal pradesh), అక్సాయిచిన్ ప్రాంతాలను చైనా భూభాగాలుగా పేర్కొంది.
బ్రిక్స్ సదస్సులో మోడీ, జిన్‌పింగ్ భేటీ అయిన నాలుగు రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చైనా సహజ వనరుల శాఖ ‘2023 ఎడిషన్ ఆఫ్ ద స్టాండర్డ్ మ్యాప్ ఆఫ్ చైనా’ పేరుతో ఈ మ్యాపుల్ని రూపొందించింది. డిజిటల్, నావిగేషన్ మ్యాపుల్ని కూడా విడుదల చేస్తున్నట్టు డ్రాగన్ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
‘చైనా ప్రామాణిక మ్యాప్ 2023 ఎడిషన్ సోమవారం అధికారికంగా విడుదల చేశాం.. సహజ వనరుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ ప్రామాణిక మ్యాప్ సర్వీస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం’ అని ట్వీట్ చేసింది.‘ఈ మ్యాప్ చైనా జాతీయ సరిహద్దులు.. , ప్రపంచంలోని వివిధ దేశాల డ్రాయింగ్ పద్ధతి ఆధారంగా రూపొందించాం’ అని తెలిపింది.
చైనా సరిహద్దులు.. అందులో భూభాగాల్ని తెలుపుతూ ఈ మ్యాపుల్ని రూపొందించగా.. భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ భూభాగాలుగా చూపింది. గతంలో విడుదల చేసిన మ్యాప్‌లో తైవాన్, దక్షిణ చైనా సముద్రం అంతా తమదేనని పేర్కొంది. తాజా ఎడిషన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రాంతాల పేర్లను ప్రామాణీకరిస్తూ మ్యాపును రూపొందించడం గమనార్హం.