తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని (Ayyanna Patrudu) కృష్ణా జిల్లా పోలీసులు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అరెస్టు (Arrest) చేయడం, అనంతరం హైవే మీద విడిచిపెట్టడం మధ్య సినీ ఫక్కీలో కొంత డ్రామా చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో చేరుకున్న అయ్యన్నను గన్నవరం పోలీసులు (Gannavaram Police) ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ ఎందుకు చేశారంటే…
ఇటీవల ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో జరిగిన తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి జనగన్మోహన్ రెడ్డి, మంత్రి రోజాతోపాటు మరికొందరు వైసీపీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మాజీమంత్రి పేర్ని నాని అయ్యన్నపాత్రుడు, బుద్ధా వెంకన్నల మీద గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన కృష్ణా జిల్లా పోలీసులు శుక్రవారం విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అయన్నను అరెస్టు చేశారు.
అయన్నపాత్రుడి అరెస్టును ఖండించిన టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా వేదికగా తీవ్రవిమర్శలు చేశారు. జగన్ మాట విని పోలీసులు ఇష్టాను సారం ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోము అంటూ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఎక్కడా కనిపించడంలేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి పాలించడం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారన్నారు.
ఇంతలో అయ్యన్న అరెస్ట్ ను ఖండిస్తూ తెదేపా కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ పోలీసులను ప్రశ్నించారు.
అయితే విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి స్థానిక పోలీసులకు సమచారం ఇవ్వకుండా తీసుకెళ్లిన అయ్యన్నను అనకాపల్లి జిల్లా యలమంచలి టోల్ గేట్ దగ్గర 41ఏ నోటీసులు ఇచ్చి విచిడి పెట్టేశారు. ఎయిర్ పోర్టులో అయ్యన్న అరెస్ట్, జాతీయ రహదారిపై విడుదల హాట్ టాపిక్ గా మారింది.