ముఖ్యమంత్రి జగన్ (CM Jagan), మంత్రి రోజా (Roja) పై అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ విశాఖ మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanaraya Murty) ని అరెస్ట్ చేసిన పరవాడ పోలీసులు గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండారుపై గుంటూరులోని అరండల్పేట, నగరపాలెంలో పీఎస్లో ఈ కేసులు నమోదయ్యాయి. బండారు సత్యనారాయణ మూర్తిని నిన్న సాయంత్రం విశాఖ నుంచి తరలించి అర్ధరాత్రి దాటిన తర్వాత 3.30 గంటలకు గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.
ప్రస్తుతం నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేశారు. ముందుగా బండారు సత్యనారాయణ మూర్తికి గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేసి, అనంతరం 11:00 గంటలకు బండారు సత్యనారాయణ మూర్తి ని న్యాయస్థానంలో పోలీసులు హాజరపరుస్తారు.
నగరపాలెం, అరండల్ పేటలో బండారుపై నమోదైన కేసులతో పాటు మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళ కమిషన్ కూడా డీజీపీకి చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు. ఈ నేపధ్యంలోనే పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు బండారును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బండారుకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పరవాడలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం బండారుకు అనుకూలంగా ఇటు విశాఖలోనూ, అటు గుంటూరు నగరపాలెంలోనూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందోళనలు చేస్తున్నారు.