టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ను సీఐడీ (CID) అధికారులు అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు నిరసన దీక్షలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డిసైతం నిరవధిక దీక్షలో కూర్చున్నారు. గత రెండు రోజులుగా వీరు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే, పోలీసులు వారి దీక్షను భగ్నం చేశారు.
శనివారం తెల్లవారు జామున నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దీక్షాశిబిరం వద్దకు చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అఖిలప్రియ మద్దతుదారులు పోలీసులను ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. పోలీసులు బలవంతంగా అఖిల ప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డినిసైతం అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఆళ్లగడ్డలోని వారి నివాసానికి తరలించేందుకు ప్రయత్నించగా అఖిలప్రియ అందుకు నిరాకరించారు. పోలీసు వాహనంలోనే దీక్షను కొనసాగిస్తామని పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఆమెను, ఆమె సోదరుడు విఖ్యాత్ రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆమె నివాసానికి తరలించారు.
నిరవధిక నిరాహార దీక్షలో భాగంగా అఖిలప్రియ శుక్రవారం మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకే దీక్ష చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులో 14ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.