నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్న గ్రూప్-1 (Group-1) కూడా సరిగా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం కేసీఆర్ (CM KCR) ఎందుకు మాట్లాడటం లేదని, 30 లక్షల మంది యువత బతుకులు బజారున పడుతుంటే సీఎం ప్రగతి భవన్ లో ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కోచింగుల పేరిట లక్షల రూపాయల ఖర్చు చేసిన యువతకు ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేదని, ఇంటర్మీడియట్, టెన్త్, గ్రూప్-1 లాంటి అన్ని రకాల పరీక్షలు నిర్వహించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెలంగాణాలో విద్యావ్యవస్థను నాశనం చేశారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్-1 విషయంలో పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, గ్రూప్-1 రాసిన వారందరికీ లక్ష రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇస్తానన్న నిరుద్యోగ భృతి బకాయిలన్నీ చెల్లించిన తర్వాతనే యువతను ఓట్లు అడగాలని బండి సంజయ్ అన్నారు.
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బండి సంజయ్ మొక్కలు నాటారు. అనంతరం బీజేపీ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. సీఎం ఇప్పటి వరకు ఫామ్‌హౌస్‌లో, ప్రగతి భవన్ లో చేసినవన్నీ తాంత్రిక పూజలేనని, ఇలాంటి పూజల్లో కేసీఆర్ ఆరితేరారని సంజయ్ విమర్శించారు.
సీఎం కేసీఆర్ సంపాదించిన కోట్లాది రూపాయలతో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. కానీ, ఆయన పాచికలు పారవు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈసారి గెలిచేది లేదు. వాళ్లకు విధి విధానాలే లేవు. కాంగ్రెస్ ఎప్పుడుంటదో.. ఎప్పుడు బాంబులా పేలిపోతుందో తెలియదు. కాంగ్రెస్‌లో గెలిచినా డబ్బులకు అమ్ముడు పోతారని కేసీఆర్‌కు తెలుసునని, కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌కు టీం-ఏ వంటిందని బండి సంజయ్ అన్నారు.
ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా.. కేసీఆర్‌ను ఎప్పుడు ఓడిద్దామా అనే కసితో ప్రజలు ఉన్నారని సంజయ్ అన్నారు. ఓయూ, కేయూలో యువత తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న బండి సంజయ్, కేసీఆర్ తప్పుడు విధానాలను ప్రశ్నించే నిరుద్యోగులపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు మోదీవైపు, బీజేపీ వైపు ఉన్నారని బండి సంజయ్ అన్నారు.