తిరుమల (Tirumala) లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు (Brahmothsavalu) ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న వెంకటేశ్వరుని కనులారా చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఇవాళ జరిగిన స్నపన తిరుమంజనం (Stnapana Tirumanjanam) తామర గింజలు, తులసి గింజలు, పవిత్రమాలలతో ఎంతో వేడుకగా జరిగింది.
సర్వాలంకృతమైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిలను వేడుకగా పురాతన ఆలయంలోని ఉన్న కల్యాణ మండపానికి తీసుకుని వచ్చారు. 108 వెండి పాత్రలతో కూడిన కుశోదకం, రత్నోదకం, క్షీరోదకం మొదలైనవి, 12 రకాల ద్రవ్యాల 9 సెట్లు పంచసూక్తుల దివ్య మంత్రోచ్ఛారణల మధ్య పవిత్ర స్నానం చేయించారు.
తిరుమలలో జరిగే స్నపన తిరుమంజనాన్ని ‘అష్టోత్తర శత కలశ స్నపన తిరుమంజనం’ అని అంటారు. అమూల్యమైన వజ్రాలతో చేసిన కవచంతో శ్రీవారిని అలంకరించారు. అత్యంత విలువైన ఆభరణాలలో అలకరించిన మలయప్పను తన భార్యలతో పాటు ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అర్చకస్వాములు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అభిషేకానంతరం పవిత్ర దండలు, పసుపురంగు పట్టుదారం దండలు, తామర గింజలు, తులసి గింజల దండలు, గోల్డ్ గ్రేప్స్ మాలలు, బాదం మాలలు, నందివర్ధనం, రోజ్ పెటల్స్, మల్టీకలర్ రోజ్ పెటల్స్ మాలలు, కిరీటాలు, తులసి దండలను శ్రీవారు, అమ్మవార్లకు అలంకరించారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక అలంకరణలు చేశారు.