జీ20 శిఖరాగ్ర సమావేశాల (G20 summit) అనంతరం స్వదేశానికి బయలుదేరేందుకు సిద్ధమవుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Trudo)కు చివరి నిమిషంలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణం వాయిదా పడింది. ప్రస్తుతం భారత్లోనే ఉన్న కెనడా ప్రధాని, ఆయన బృందం మళ్లీ ఎప్పుడు బయలుదేరుతారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.
‘‘ఈ సమస్యలు ఒక్క రాత్రిలో పరిష్కారం కావు. ప్రత్యామ్నాయం సిద్ధం చేసే వరకూ మా బృందం భారత్లోనే ఉంటుంది’’ అని కెనడా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతకుమునుపు జస్టిన్ ట్రూడోతో మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ భూభాగంలో సిక్కు వేర్పాటువాదులు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కొందరు అతివాదులు కెనడా వేదికగా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతుండటంపై ప్రధాని మోడీ కెనడా ప్రధాని వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
వేర్పాటువాదులు, వ్యవస్థీకృత నేరస్థులు, డ్రగ్స్, మానవుల అక్రమరవాణాకు పాల్పడేవారు కుమ్మక్కవడం కెనడాకు కూడా ఆందోళనకరమే. ఈ ప్రమాదాలను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు కలిసికట్టుగా పనిచేయడం ఆవశ్యకం’’ అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్ వేదికగా జరుగుతున్న జీ20 సమావేశాలకు కెనడా ప్రధాని వచ్చినా కూడా భారత్, కెనడాతో అధికారికంగా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించకుండా సిక్కు వేర్పాటువాదంపై తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తీకరించింది. కానీ, ఇరు దేశాల నేత మధ్య జరిగిన అనధికారిక సంభాషణల్లో మోడీ తన అభ్యంతరాలను వ్యక్తీకరించినట్టు తెలుస్తోంది.