చంద్రబాబు అరెస్టైన (Chandrababu Arrest) తర్వాత సీఎం జగన్ (CM Jagan) ఈ అంశంపై తొలిసారి మాట్లాడారు. నిడదవోలులో జరిగిన కాపు నేస్తం (Kapu Nestham) సభలో సీఎం వైయస్ జగన్ చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, రాజకీయాలపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…
ఇటీవల స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సాక్ష్యాలు, ఆధారాలతో ఒక మహానుభావుడు చంద్రబాబు అరెస్టైయ్యారు, దురదృష్టమేమిటంటే ఎంత దోపిడీ, దొంగతనాలు చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబును రక్షించే దొంగల ముఠా సభ్యులు ఉన్నారు కానీ, చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పే వారు ఇన్నాళ్లూ లేరని అన్నారు.
ఒక మామూలు వ్యక్తి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అధికారంలో ఉన్నవారికి అదే శిక్ష పడుతుందని చెప్పేవారు ఇన్నాళ్లూ లేరని, చట్టం ఎవరికైనా ఒక్కటే అని చెప్పేవారు ఇప్పుడు గళం విప్పుతున్నారని చెప్పారు. ఇలా చెప్తూంటే…ఈ దొంగల ముఠా సభ్యులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు.
చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికినా…చివరికి ఆ వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చినా కూడా ఆయనకు మద్దతు తెలిపే ఛానళ్లు, పత్రికలు ఏ తప్పు చేయలేదని చెప్తున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాంతో తమకు ఎటువంటి సంబంధం లేని సీమెన్స్ కంపెనీ చెప్పింది. మరో వైపు ఫేక్ అగ్రిమెంట్ చేసిన దొంగలను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఆధారాలతో పట్టుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి చంద్రబాబేనని చెప్తున్నా కూడా…ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అనే వాడు ప్రశ్నించడం లేదని జగన్ అన్నారు.
తనకు ఎవరు తోడున్నా లేకున్నా మీరు నాకు మీరే తోడంటూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో జరగబోయేది కురుక్షేత్ర యుద్ధమని సీఎం జగన్ అన్నారు. తనకు చంద్రబాబలాగా మీడియా, దత్తపుత్రుడు సపోర్టు లేదని, ప్రజల ఆశీస్సులు, దేవుని దీవెనలే అండగా ఉన్నాయని జగన్ చెప్పారు. న్యాయం, ధర్మం తన పక్షాన ఉన్నాయని, ప్రజలే తన సైనికులు, అండదండ అంటూ జగన్ చెప్పారు.