రాయలసీమ (Rayalaseema) వాసుల నీటి కష్టాలు తనకు తెలుసునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ సీఎం (CM Jagan) కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం నుంచి డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు నీటిని నింపే ప్రాజెక్టును (Water Projects) సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. లక్కసాగరం వద్ద పంప్‌హౌస్‌ను సీఎం జగన్ ప్రారంభించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీటి సరఫరా అందించేందుకు ప్రభుత్వం రూ.224 కోట్లతో పంప్‌హౌస్‌ను ప్రభుత్వం నిర్మించింది. 77 చెరువులకు లక్కసాగరం పంప్‌హౌస్ నీటిని అందించనుంది.
ఈ సందర్భంగా సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించారు. రాయలసీమలో నీటి కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసునని అన్నారు. భవిష్యత్తులో రాయలసీమలో నీటి కష్టాలు లేకుండా చేసేందుకు, సీమలో కరువు జిల్లాలు అనే మాట వినపడకుండా ఉండేందుకు సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చాక కర్నూలు, నంద్యాల జిల్లాలకు సాగు నీరు, లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు, హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరoవులకు నీటి కేటాయింపు వంటివి జరిగాయి, కానీ గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికలకు 4 నెలలకు ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలు చేశారు కానీ, ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదన్నారు.
తన పాదయాత్రలో రాయలసీమలోని ప్రజల కష్టాలను చూసిన తాను అధికారంలోకి రాగానే కరువుతో అల్లాడుతున్న సీమకు మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల పూర్తికి చర్యలు తీసుకున్నామని, రూ. 253 కోట్లతో ప్రాజెక్ట్‌ను పూర్తి చేశామని చెప్పారు.
గత ప్రభుత్వం ప్రాజెక్ట్‌లను పట్టించుకో లేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టామని, వెలుగొండ ప్రాజెక్ట్‌ను కూడా వడివడిగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. దీని రెండో టన్నెల్ పూర్తి చేసి అక్టోబర్‌లో ప్రారంభిస్తున్నామన్నారు.