ఏపీలోని ఓ కానిస్టేబుల్ (Constable) చూపిన ధైర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతుంది. ఈ సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ నెటిజన్లు కానిస్టేబుల్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సంఘటన ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ (Railway Track) పై జరిగింది. అసలేం జరిగిందంటే…
తనను తాను గాయపరుచుకుంటూ…ఓ యువకుడు తన భార్యపై బ్లేడ్ తో దాడి చేస్తూ రైల్వే ట్రాక్ పై ఆమె జట్టు పట్టుకుని తీసుకెళ్తున్నాడు. భార్యను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి అంతమొందించాలని చూశాడు తన భర్త. అయితే ట్రాక్ పై బ్లేడుతో దాడికి పాల్పడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు వద్దని వారించినా…దగ్గరికి రావొద్దంటూ వారినీ భయబ్రాంతులకు గురిచేశాడు.
ఆ యువకుడి చేతిలో బ్లేడ్ ఉండడంతో అతడి వద్దకు వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయలేకపోయారు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాక్ నుంచి పక్కుకు రావాలని అతడికి నచ్చజెప్పారు. వారి మాటలు కూడా ఆ యువకుడు వినలేదు.
ఇంతలోనే ఆ ట్రాక్ పై ట్రైన్ వస్తోంది. ఓ పక్క యువకుడి చేతిలో బ్లేడు, మరొపక్క కూత వేటు దూరంలో ట్రైన్.. సరిగ్గా ఈ సమయంలోనే ధైర్య సాహసాలు ప్రదర్శించాడు ఓ కానిస్టేబుల్. ట్రాక్ పై తన భార్యను పట్టుకుని ట్రైన్ కు ఎదురుగా వెళ్తున్న అతడిని వెంబడించి అతడి చేతుల్లో ఉన్న బ్లేడును కిందపడేలా చేశాడు కానిస్టేబుల్. ఆ తరువాత ఆ మహిళను రైల్వే ట్రాక్ నుంచి తప్పించి కాపాడాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ప్రాణాలకు తెగించి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.